Home >>> వైరల్ > ఆంధ్రప్రదేశ్ లో పురాతన ఆస్ట్రిచ్ గూడు, ఎన్ని వేల ఏళ్ళ క్రితం అంటే...?
ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచంలోని అతి పురాతనమైన 41,000 సంవత్సరాల నాటి నిప్పుకోడి (Ostrich) గూడు... కనుగొన్నారు శాస్త్రవేత్తలు. వడోదర యూనివర్శిటీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు మరియు జర్మనీ, ఆస్ట్రేలియా అలాగే అమెరికాకు చెందిన పలువురు నిపుణులు వాటిని కనుగొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో శిలాజాలకు ఆవాసమైన ప్రాంతంలో పరిశోధనలు చేస్తున్నప్పుడు ఈ గూడు వారి కంట పడింది.
గూడుతో పాటుగా 911 ఉష్ట్రపక్షి గుడ్లను కలిగి ఉన్న భారీ నిర్మాణంను గుర్తించారు. ఇది పురాతన మెగాఫౌనల్ పక్షుల ప్రవర్తన మరియు ఆవాసాలపై ఎంతో కీలకమైన సమాచారాన్ని అందిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. సాధారణంగా ఉష్ట్రపక్షి గూడు... 9 నుండి 10 అడుగుల వెడల్పు ఉంటుంది, అటువంటి గూళ్ళు ఒకేసారి 30 నుండి 40 గుడ్లను ఎక్కడైనా పెట్టుకునే ఆస్కారం ఉంటుంది.
ఈ పరిశోధన మన దేశంలో మెగాఫౌనల్ జాతుల చరిత్రను, వాటి జీవన శైలిని అర్థం చేసుకోవడంలో కీలకమైన సమాచారాన్ని అందించే అవకాశం ఉంటుందని... వడోదరలోని ఎంసీయు ఆర్కియాలజీ అండ్ ఏన్షియంట్ హిస్టరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవర అనిల్ కుమార్ అన్నారు. 1x1.5 మీటర్ల పరిమిత ప్రాంతంలో దాదాపు 3,500 ఉష్ట్రపక్షి గుడ్డు పెంకులను గుర్తించడం అనేది దక్షిణ భారతదేశంలో ఉష్ట్రపక్షి యొక్క చారిత్రక ఉనికిని ధృవీకరించడమే కాకుండా ప్రపంచంలోని పురాతన ఉష్ట్రపక్షి గూడు ఉనికిని కూడా బయటపెట్టినట్టు ఆయన పేర్కొన్నారు.