Home >>> తెలంగాణ > రియల్ ఎస్టేట్ కుదేలు... ఆ ఇద్దరే కారణం...!
ఏ రాష్ట్రానికైనా సరే... ప్రధాన ఆదాయ వనరు రియల్ ఎస్టేట్ రంగం. ఇళ్లు, స్థలాల క్రయవిక్రయాలు జరుగుతున్నప్పుడే ప్రజల దగ్గర ఉన్న డబ్బులు సమాజంలో చలామణి అవుతాయి. అలాగే ప్రభుత్వానికి కూడా పలు విధాలుగా ఆదాయం వస్తుంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు ఇసుక, ఇటుక, సిమెంట్, విద్యుత్ ఉపకరణాలు, ఇంటికి కావాల్సిన ఫర్నీచర్, ఇతర సామాగ్రి వంటి కొనుగోలుపైన కూడా నగదు చలామణి అవుతుంది. దీని ద్వారా కూడా ప్రభుత్వ ఖజానాకు నిధులు జమ అవుతుంటాయి. అలాగే పలు రంగాలకు చెందిన కార్మికులకు కూడా ఉపాది లభిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటి రుణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అయితే కొన్ని అనాలోచిత, దూకుడు నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతుందనేది వాస్తవం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కాస్త కుంటుపడిందనేది వాస్తవం. ఇందుకు ప్రధాన కారణం... విజనరీ అని పేరున్న చంద్రబాబు ఏపీకి సీఎం అయ్యారు. అమరావతిని రాజధానిగా ప్రకటించడమే కాకుండా... ఎన్నో బడా సంస్థలతో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నారు చంద్రబాబు. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు ఎన్ఆర్ఐలు కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపారు. దీంతో ఏపీలో స్థలాల కొనుగోలు జోరుగా సాగింది. అదే సమయంలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం బాగా పడిపోయింది. అయితే 2019 ఎన్నికల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఒకేఒక్క నిర్ణయంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఇసుక ధరల పెంపుతో పాటు.. మూడు రాజధానులంటూ జగన్ చేసిన ప్రకటనతో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుదేలైంది. అమరావతి నిర్మాణం ఆగిపోవడం, పెట్టుబడులు వెనక్కి పోవడంతో.. మళ్లీ హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశానంటాయి. ఇదే అంశాన్ని కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. తెలంగాణలో ఎకరా భూమి కొనలంటే... ఏపీలో పదెకరాలు అమ్మాలి అంటూ సెటైర్లు వేశారు. ఇక 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి మరోసారి తారుమారైంది.
తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అమరావతి నిర్మాణంపై దృష్టి పెట్టిన చంద్రబాబు... కేంద్రంతో రూ.15 వేల కోట్ల రుణం మంజూరు చేయించగలిగారు. అలాగే అమరావతిలో జంగలి క్లియరెన్స్ పనులు కూడా పూర్తి చేశారు. 2027 అక్టోబర్ నాటికి అమరావతి తొలిదశ పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు కూడా. దీంతో అమరావతికి పూర్వ వైభవం వస్తుందని భావించిన వారు పెట్టుబడులు పెడుతున్నారు. ఇదే సమయంలో రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంపై పెను ప్రభావం చూపిస్తోంది. చెరువుల పరిరక్షణలో భాగంగా హైడ్రాను రంగంలోకి దించడంతో... కొత్తగా కొనుగోలు చేసేందుకు అంతా భయపడుతున్నారు. అసలు ఏది అక్రమమో... ఏది సక్రమమో తెలియక తికమకపడుతున్నారు. తీరా కొన్న తర్వాత... అది కూల్చేస్తామంటూ నోటీసులు వస్తే.. తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో క్రయ విక్రయాలు దాదాపు నిలిచిపోయాయనే చెప్పాలి. దీంతో రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్‌లో పెరగడానికి జగన్ కారణమైతే... పడిపోవడానికి రేవంత్ కారణమంటున్నారు. అలాగే అమరావతిలో పడిపోవడానికి జగన్ కారణమైతే... పుంజుకోవడానికి రేవంత్ తీసుకువచ్చిన హైడ్రా పరోక్షంగా కారణమంటున్నారు విశ్లేషకులు.