Home >>> ఆంధ్రప్రదేశ్ > బాబు గారు... ఇదేం లెక్క సార్....!
తెలుగు తమ్ముళ్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల తొలి జాబితా విడుదల చేశారు చంద్రబాబు. అయితే అందరూ ఊహించింది వేరు... వచ్చిన జాబితాలో ఉన్న పేర్లు వేరు. ఒక్కమాటలో చెప్పాలంటే.. అనుకున్నది ఒక్కటి... అయ్యింది ఒక్కటి అన్నట్లుగా చంద్రబాబు అందరికీ షాక్ ఇచ్చారు. తొలి నుంచి చెబుతున్నట్లే చేసినప్పటికీ... కొన్ని లెక్కలు మాత్రం పూర్తిగా తప్పిపోయాయనేది వాస్తవం. నామినేటెడ్ పదవుల జాబితాలో అందరూ మొదటగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఉంటుందని భావించారు. కానీ అది ఇవ్వలేదు. అలాగే... ప్రధాన కార్పొరేషన్లకు తొలి నుంచి అనుకుంటున్న పేర్లు ఏ మాత్రం లేవు అనేది వాస్తవం.
పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన వారికి, పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందని... వారికే నామినేటెడ్ పదవులు దక్కుతాయని చంద్రబాబు తొలి నుంచి చెబుతున్నారు. అయితే తొలి జాబితాలో మాత్రం... ఆలాంటి వారికి సరైన న్యాయం జరగలేదు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి దేవినేని ఉమాకు మైలవరం నియోజకవర్గం టికెట్ కేటాయించలేదు చంద్రబాబు. అక్కడ నుంచి వసంత కృష్ణప్రసాద్ పోటీ చేసి గెలిచారు. దీంతో దేవినేని ఉమకు ఆర్టీసీ ఛైర్మన్ అనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే తాజా జాబితాలో ఆ పదవి కొనకళ్ల నారాయణకు కేటాయించారు. పైగా జాబితాలో దేవినేని పేరు ఎక్కడా లేదు.
ఇక మరో నేత ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన ఉక్కు ప్రవీణ్ అలియాస్ డా.ప్రవీణ్ కుమార్ రెడ్డి. దాదాపు పదేళ్ల పాటు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలను ధీటుగా ఎదుర్కొన్నారు. అలాగే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రవీణ్పైన దాదాపు 35 కేసులు పెట్టారు. అయితే చివరి నిమిషంలో వరద రాజుల రెడ్డికి టికెట్ ఇవ్వడంతో... ప్రవీణ్ సైలెంట్ అయ్యారు. నామినేటెడ్ పదవి ఇస్తామంటూ నారా లోకేశ్ స్వయంగా హామీ ఇచ్చారు కూడా. ఏపీఐఐసీ పదవి వస్తుందని ప్రవీణ్ ఎంతో ఆశ పడ్డారు. అయితే ఆ పదవిని మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు కేటాయించారు. ఫస్ట్ లిస్టులో ప్రవీణ్ పేరు కనిపించలేదు.
పార్టీ అధికార ప్రతినిధి పట్టాభికి కూడా నామినేటెడ్ పదవి వస్తుందని గంపెడాశ పెట్టుకున్నారు. ఆయనకు పౌర సరఫరాల కార్పొరేషన్ లేదా విత్తనాభివృద్ధి కార్పొరేషన్ వస్తుందని భావించారు. పట్టాభి పైన వైసీపీ నేతలు, రౌడీ మూకలు దాడి కూడా చేశాయి. దాదాపు నెల రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపారు. ఇంటి మీదకు వెళ్లి హత్యాయత్నం కూడా చేశారు. దీంతో పదవి గ్యారెంటీ అని భావించిన పట్టాభికి చంద్రబాబు షాక్ ఇచ్చారు. పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్‌గా జనసేనకు చెందిన సీతారామ సుధీర్, విత్తానాభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా మన్నే సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు. పట్టాభి పేరు కూడా జాబితాలో లేదు.
మరో మహిళా నేత ఆచంట సునీత కూడా మహిళా కమిషన్ ఛైర్మన్ పదవి వస్తుందని భావిస్తున్నారు. దాదాపు 20 ఏళ్లుగా పార్టీలోనే కొనసాగుతూ... పలు రాష్ట్ర స్థాయి పదవులు నిర్వహించారు. ఐదేళ్లుగా అంగన్వాడీ, డ్వాక్రా సాధికారిత సమితి టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు కూడా. మహిళా కమిషన్ ఛైర్మన్ పదవి కోసం అటు మాజీ మంత్రి పీతల సుజాత పేరు కూడా బలంగానే వినిపించింది. అయితే ఫస్ట్ లిస్ట్‌లో పీతల సుజాతకు స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఛైర్మన్ గా అవకాశం కల్పించారు. కానీ ఆచంట సునీత పేరు మాత్రం జాబితాలో లేదు. అయితే మహిళా కమిషన్ ఛైర్మన్ పదవి కూడా ఎవరికీ కేటాయించక పోవడంతో... రెండో జాబితాలో పేరు ఉంటుందనే ధీమాతో ఉన్నారు.
ఇక టీటీడీ బోర్డు కూడా చంద్రబాబు ప్రకటించలేదు. వీటితో పాటు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ పదవులు ఇప్పటికీ ప్రకటించలేదు. దీంతో ఎవరికి అవకాశం ఉంటుందో.. చంద్రబాబు ఎవరి పేరు చదువుతారో అని నేతలంతా టెన్షన్ పడుతున్నారు.