Home >>> ఆంధ్రప్రదేశ్ > జగన్ గేమ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా....?
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆరోపించారు. దీనిపై విచారణ కోసం సిట్ బృందాన్ని నియమించారు. అయితే అదంతా అబద్ధమని... తమపై అకారణంగా నిందలు వేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుమలలో ఎలాంటి కల్తీ జరగలేదని... కావాలంటే ప్రమాణం చేస్తానని మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించగా... మరో మాజీ భూమన కరుణాకర్ రెడ్డి నేరుగా తిరుమల చేరుకుని ప్రమాణం చేసేశారు కూడా. అయితే ఈ వ్యవహారంలో తమ తప్పేమి లేదని చెబుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్... ఈ పాపంలో మీది కూడా భాగముంది అని బీజేపీ నేతలకు కూడా ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు.
వాస్తవానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఏర్పాటులో దాదాపు అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పిస్తారు. ఏపీకి చెందిన ప్రజాప్రతినిధులతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన ప్రముఖులకు అవకాశం కల్పించడం తొలి నుంచి వస్తున్న ఆనవాయితీ. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా... ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖులను బోర్డు సభ్యులుగా నియమిస్తారు. అందులో భాగంగానే 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో బోర్డు సభ్యులుగా కొనసాగిన సుధా మూర్తి, శేఖర్ రెడ్డిలకు మరోసారి జగన్ కూడా బోర్డు సభ్యత్వం ఇచ్చారు. ఇక ఐదేళ్ల పాటు బీజేపీతో అంతర్గత పొత్తులో భాగంగా మహారాష్ట్రకు చెందిన నేతలకు కూడా పాలకమండలి సభ్యత్వం కల్పించారు వైఎస్ జగన్. దీనినే ఇప్పుడు జగన్ బ్రహ్మాస్త్రంగా వినియోగించే ప్రయత్నం చేస్తున్నారు.
నెయ్యి టెండర్ల విషయంలో ఛైర్మన్ తీసుకున్న నిర్ణయానికి బోర్డు సభ్యుల ఆమోదం తప్పని సరి అని... పైగా ఏ నిర్ణయం అయినా సరే... పాలకమండలి సమావేశంలో చర్చించిన తర్వాతే తీసుకున్నట్లు జగన్ కొత్త భాష్యం చెబుతున్నారు. కాబట్టి.. ఈ వ్యవహారంలో తప్పు జరిగి ఉంటే... అందులో బీజేపీ నేతలకు కూడా భాగస్వామ్యం ఉంటుందనే మాటను నర్మగర్భంగా ప్రస్తావిస్తున్నారు జగన్. కల్తీ నెయ్యి వ్యవహారంలో తొందరపడి నోరు జారితే... మీకు కూడా ఇబ్బందులు తప్పవనే మాటను సూత్రప్రాయంగా హెచ్చరించారు. బోర్డులో బీజేపీ నేతలు కూడా సభ్యులుగా ఉన్నారనే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.
లేఖ రాసిన తర్వాత నుంచి బీజేపీ నేతలు సైలెంట్ అయ్యారనేది వాస్తవం. చంద్రబాబు ఆరోపణలు చేసిన వెంటనే... ఏపీలో బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. దీనిపై జాతీయ స్థాయి బీజేపీ నేతలు కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రధాని మోదీకి జగన్ లేఖ రాసిన తర్వాత నుంచి... కమలం పార్టీ నేతలు సైలెంట్ అయ్యారు. దీనిపై ప్రస్తుతం టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నప్పటికీ... గోడ మీద పిల్లి మాదిరిగా... సైలెంట్‌గా ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నారు తప్ప... ఎలాంటి వ్యాఖ్యలు చేయటం లేదు. దీంతో జగన్ ప్లాన్ వర్కవుట్ అయ్యిందనే మాట పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా వినిపిస్తోంది.