వీరికే పదవులంట... పుకార్లతో హడల్...!

Home >>> ఆంధ్రప్రదేశ్ > వీరికే పదవులంట... పుకార్లతో హడల్...!

news-details

ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఇద్దరు నేతలు కలిసినా... ఏ ఇద్దరు రాజకీయ విశ్లేషకులు కలిసినా... ఒకటే అంశంపై చర్చ... అదే నామినేటెడ్ పదవుల ప్రకటన ఎప్పుడూ.... వాస్తవానికి పదవులిచ్చేది సీఎం చంద్రబాబు... దీనిపై నిర్ణయం తీసుకునేది కూటమి పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి. ఈ ముగ్గురు నేతలే ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అనేది చర్చించుకుని ఫైనల్ చేసేది. వాస్తవానికి వాళ్ల మనసులో ఏముందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. పదవుల ప్రకటన ఎప్పుడూ అనేది కూడా తెలియదు. పైగా ఎప్పుడు, ఎవరికి పదవులు ఇవ్వాలో తనకు తెలుసని నేరుగా చంద్రబాబే మంత్రులకు, నేతలకు క్లారిటీ ఇచ్చేసారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తొలి నుంచే... సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న కొన్ని జాబితాలు నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి సరిగ్గా వంద రోజులు పూరైంది. ప్రభుత్వం వచ్చిన తొలి రోజు నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు... ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం... రాజధాని, పోలవరం నిర్మాణం, వరదలు, సాయం, అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థలను చక్కబెట్టడం, అధికారుల బదిలీలపైనే ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఐదేళ్ల జగన్ పాలనలో వైద్య, విద్యా, ఆర్థిక వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయాయి. ఏ శాఖ చూసినా అవినీతి. ఖజానాను పూర్తిగా ఖాళీ చేయడంతో పాటు... అప్పుల కుప్పగా మార్చేశాడు జగన్. దీంతో విజనరీ చంద్రబాబు... సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టారు. ఒక్కొ వ్యవస్థను నెమ్మదిగా చక్కబెడుతున్నారు. దీంతో నామినేటెడ్ పదవుల కేటాయింపు కాస్త ఆలస్యమైంది. 

అయితే ఈలోపు ఈ పదవి ఆ నేతకు... ఆ పదవి ఈ నేతకు... అంటూ సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు వైరల్ చేస్తున్నారు. టీటీడీ ఛైర్మన్ పదవికి ఇప్పటికే ఐదుకు పైగా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అలాగే ఏపీఐఐసీ, మహిళా కమిషన్, టూరిజమ్, ఫుడ్ కార్పొరేషన్ వంటి కీలక పదవులకు అయితే... ఎవరికి నచ్చిన పేరును వాళ్లు పెట్టేసుకుంటున్నారు. పని చేసిన వారికే పదవులు అని చంద్రబాబు ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అయినా సరే... సోషల్ మీడియాలో కాస్త పాపులారిటీ సాధిస్తే చాలు.. పదవి తమకే అని కొందరు నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కీలక పదవుల కోసం అప్లికేషన్ పెట్టిన నేతలు కూడా... ఆ పదవి మాకే కావాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీఐఐసీ ఛైర్మన్ పదవికి ఐదుగురు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక మహిళా కమిషన్ పదవి కోసం అయితే ఊరు పేరు లేని నేతలు కూడా పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు... ఏకంగా 200 మంది మహిళలు పదవి కావాలని అప్లికేషన్ ఇచ్చినట్లు సమాచారం. అయితే పార్టీ మాత్రం... ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేతకే ఆ పదవిని ఇస్తున్నట్లు తెలుస్తోంది.

పర్యాటకంపై కనీస అవగాహన లేని నేతలు కూడా టూరిజం బోర్డు ఇస్తే బాగుంటుంది కదా అని సన్నిహితుల దగ్గర ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. ఫుడ్ కార్పోరేషన్, జల వనరుల శాఖ, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్.. పదవుల కోసం సీనియర్ నేతల వారసులు తెగ పోటీ పడుతున్నారు. ఆ పదవి తమదే అని సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అయితే ఎవరికి ఏ పదవి ఇవ్వాలనే దానిపై కనీసం ఒక్క  లీక్ కూడా లేదని... ప్రస్తుతం బయట ప్రచారం అవుతున్నవన్నీ ఫేక్ లిస్టులే అని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే ఈ ఫేక్ ప్రచారం కారణంగా... కొందరు సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు కూడా. ఇలాంటి ఫేక్‌ ప్రచారానికి బ్రేక్ పడాలంటే... కనీసం కొన్ని పదవులైనా ప్రకటిస్తే బాగుంటుందంటున్నారు. దసరా నాటికి లిస్ట్ వస్తుందని అంతా భావిస్తున్నారు.

You can share this post!