Home >>> ఆంధ్రప్రదేశ్ > వైసీపీ భవిష్యత్తు ఏమిటీ...?
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న ఏ ఇద్దరు కలిసినా సరే... ముందుగా మాట్లాడుకునే మాట... వైసీపీ పరిస్థితి ఏమిటీ... అసలు పార్టీకి భవిష్యత్తు ఉందా... ఈ సంక్షోభాల నుంచి వైసీపీ కోలుకుంటుందా... అనే ప్రశ్నలే తలెత్తుతున్నాయి. నిజమే... రాజకీయాల గురించి ఏ మాత్రం అవగాహన ఉన్న వాళ్లు అయినా సరే... ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో... ఇవే ప్రశ్నలు వేసుకుంటున్నారు. ఐదేళ్లు అధికారం అనుభవించిన వైఎస్ జగన్‌కు ఇప్పుడు వరుస దెబ్బలు తగులుతున్నాయి. అవి కూడా మామూలుగా కాదు... గుక్క తిప్పుకోలేనటువంటి దెబ్బలు తగులుతున్నాయి. ఇన్ని రోజులు అత్యంత ఆప్తులుగా నమ్మిన వారే పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. అదే సమయంలో జగన్ చెప్పిందే వేదం అన్నట్లుగా పాటించిన అధికారులు కేసుల ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడిపోతున్నారు. కొంత మంది అధికారులు అయితే... మాకెందుకు వచ్చింది అన్నట్లుగా ఇప్పటికే జగన్‌కు టాటా చెప్పేసి... ఇతర దేశాలకు చెక్కేస్తున్నారు.
ఐదేళ్ల జగన్ పాలనలో మద్యం, ఇసుక, మైనింగ్ మాఫియా విపరీతంగా ఉందనేది బహిరంగ రహస్యం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ మూడు అంశాలపైనే దృష్టి పెట్టారు. మద్యం మాఫియా వెనుక ఉన్న వాసుదేవరెడ్డిపైన ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేశారు. ఇసుక మాఫీయాకు అండగా నిలిచిన గనుల వెంకటరెడ్డి... సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోయినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇక జగన్ వెంటే ఉంటూ... షాడో సీఎంగా వ్యవహరించిన సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రస్తుతం ఎక్కడా కనిపించటం లేదు. జగనన్న అంటూ తిరిగిన నేతలు కూడా కనుచూపు మేరలో కనిపించటం లేదు. బాలినేని వంటి సమీప బంధువులు కూడా జగన్‌పైన ఆరోపణలు చేసి పార్టీ మారుతున్నారు. మోపిదేవి, ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు ఇప్పటికే ఎంపీ పదవులకు రాజీనామా చేసేశారు.
ఇలాంటి సమయంలో తిరుమల లడ్డూ వ్యవహారం వైసీపీకి కావాల్సినంత చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిని వైసీపీ హాయంలో కల్తీ చేశారని... తిరుమలో వైవీ సుబ్బారెడ్డి హయాంలో ఇష్టం వచ్చినట్లుగా అక్రమాలు జరిగాయని... వందల కోట్ల రూపాయల నిధుల గోల్ మాల్ జరిగినట్లు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. దీనిపై సిట్ బృందాన్ని కూడా విచారణకు ఆదేశించారు. ఇది సున్నీత వ్యవహారం కావడంతో.. వైసీపీ మెడకు చుట్టుకుంది. ప్రతి హిందువులకు చెందిన అంశం కావడంతో పాటు... ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమల కొండపై భోజనం సరిగా లేక పోవడం, వసతి గదుల ధరలు పెంచడం, దర్శనాల కేటాయింపు, వీఐపీల తాకిడి, శ్రీ వాణి ట్రస్టుపపై ఆరోపణలు... ఇలా ఎన్నో అంశాలు వైసీపీని ఇరుకున పెడుతున్నాయి. ఈ అంశాల నుంచి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ... కూటమి పార్టీలతో పాటు హిందూ ధార్మిక సంఘాలు కూడా ఆరోపణలు చేయడంతో... వైసీపీ నేతలకు ఏంచేయాలో కూడా పాలుపోవడం లేదు. ఓ వైపు నేతలంతా వెళ్లిపోవడం... మరోవైపు సున్నిత అంశంపై వివాదం... దీంతో.. వైసీపీ భవిష్యత్తు ఏమిటీ అనే ప్రశ్న తలెత్తుతోంది.