మౌనమేల నోయి... నీ పయనమెటో తేల్చవోయి...!

Home >>> ఆంధ్రప్రదేశ్ > మౌనమేల నోయి... నీ పయనమెటో తేల్చవోయి...!

news-details

మౌనమేల నోయి.. అనే పాట ఇప్పుడు సిక్కోలు జిల్లాలో తెగ వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం... మాజీ మంత్రి, సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వ్యవహారమే అంటున్నారు లోకల్ లీడర్లు. 2019 ఎన్నికల నాటి నుంచి ఏపీలో రాజకీయ పరిణామాలపై ధర్మాన ప్రసాదరావు కాస్త కినుక వహించారనేది వాస్తవం. ఇందుకు ప్రధాన కారణం... ఏపీలో సీనియర్‌గా, రాజకీయ చాణిక్యుడిగా గుర్తింపున్న నేతగా ధర్మానకు పేరు. పైగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుల్లో ధర్మాన ఒకరు. ఇలాంటి కీలక నేతకు వైసీపీ అధినేత జగన్ సరైన గుర్తింపు ఇవ్వలేదనేది వాస్తవం. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ధర్మాన సోదరుల్లో కృష్ణదాస్‌ను ఉప ముఖ్యమంత్రిని చేశారు. పొరుగు నియోజకవర్గం ఆమదాలవలసకు చెందిన తమ్మినేని సీతారాంను స్పీకర్‌ను చేశారు. తర్వాత ఇదే జిల్లాకు చెందిన సీదిరి అప్పల్రాజును కూడా మంత్రిని చేశారు. కానీ ధర్మాన ప్రసాదరావును మాత్రం పట్టించుకోలేదు. ఇక మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ సమయంలో కృష్ణదాస్‌ను తప్పించి... ప్రసాద్‌ను మంత్రిని చేశారు. అయితే పేరుకే మంత్రి అయినప్పటికీ... పెత్తనం మొత్తం సజ్జల, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి చేతుల్లో ఉండటంతో.. ఈయనకు పెద్దగా పని లేకుండా పోయింది. అందుకే ఎన్నికలప్పుడు కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చాడని... తన్ని పంపిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చానని బహిరంగ వేదిక మీదే ధర్మాన అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపాయి. 

ఇక ఎన్నికల్లో తనకు బదులుగా తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకు టికెట్ ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్‌ను ధర్మాన ప్రసాదరావు ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశారు. అయితే జగన్ మాత్రం... ఈసారికి మీరే... అని ఖరాఖండిగా తేల్చిచెప్పేశారు. దీంతో అన్యమనస్కంగానే ఎన్నికల్లో ధర్మాన పోటీ చేశారు. అయితే కొత్త అభ్యర్థి చేతిలో గతంలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 50 వేల పై చిలుకు ఓట్లతో ఓడిపోయారు ధర్మాన ప్రసాదరావు. ఇక నాటి నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా ధర్మాన బయటకు వచ్చిన సందర్భం లేదు. చివరికి సిక్కోలు నేతలతో జగన్ నిర్వహించిన సమావేశానికి కూడా ధర్మాన డుమ్మా కొట్టారు.

ఇక ప్రస్తుత పరిస్థితులపై ఓ సీనియర్ నేతగా ధర్మాన అభిప్రాయం కోసం ప్రయత్నించిన పార్టీ నేతలకు కూడా చుక్కెదురైంది. ఏపీలో వరదలపైన, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పైన, కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పైన వైసీపీ అధినేత సహా పలువురు నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే పరిస్థితి ఇంత హాట్‌హాట్‌గా ఉన్నప్పటికీ... ధర్మాన ఆచూకీ మాత్రం కనిపించడం లేదు. చివరికి సిక్కోలు స్థానిక నేతలు, కార్యకర్తలకు కూడా ధర్మాన అందుబాటులో లేరు. దీంతో ధర్మాన రాజకీయ భవిష్యత్తుపై జోరుగా చర్చ నడుస్తోంది. ధర్మాన మౌనం వెనుక రాజకీయ సన్యాసమా లేక  పార్టీ మార్పా... అనే ప్రశ్న తలెత్తుతోంది. 1989 నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతున్న తనకు జగన్ సరైన గుర్తింపు ఇవ్వలేదనేది ధర్మాన మాట. అలాగే ప్రస్తుతం పార్టీలో పలువురు సీనియర్ నేతలు రాజకీయ భవిష్యత్తు కోసం జగన్‌కు గుడ్ బై చెప్పేస్తున్నారు. దీంతో తాను కూడా కుమారుడి భవిష్యత్తు కోసం జగన్‌కు బై బై చెప్పేస్తే ఎలా ఉంటుందని ఇటీవల మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. బాలినేని బాటలో జనసేనలో చేరాలా... లేక జగన్ అక్రమాస్తుల కేసులో తన సహచర నిందితుడు మోపిదేవి వెంకటరమణ సలహాతో బీజేపీలో చేరాలా అనే విషయంపై అత్యంత ఆప్తులతో ధర్మాన చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తోంది. ఏదీ ఏమైనా... ధర్మాన మౌనం వెనుక... రాజకీయ పెను తుఫాన్ దాగి ఉందంటున్నారు ఆయన అనుచరులు. ధర్మాన ఏ నిర్ణయం తీసుకున్నా... తామంతా ఆయనతో ఉంటామంటున్నారు ప్రసాదరావు అభిమానులు. మరి ధర్మాన రాజకీయ భవిష్యత్తు నిర్ణయం ఎలా ఉంటుందో తెలియాలంటే... మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

You can share this post!