బాబు పొలిటికల్ గేమ్ ప్లాన్ అదుర్స్...!

Home >>> ఆంధ్రప్రదేశ్ > బాబు పొలిటికల్ గేమ్ ప్లాన్ అదుర్స్...!

news-details

రాజకీయాల్లో అపర చాణిక్యుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పేరు. 45 ఏళ్లు పైగా సుదీర్ఘ రాజకీయ అనుభవం.. 14 ఏళ్ల ముఖ్యమంత్రి పాలన, 15 ఏళ్ల ప్రతిపక్ష హోదా.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పగల నేతగా గుర్తింపు.. వీటన్నిటికి తోడు... విజనరీ అనే పేరు కూడా చంద్రబాబు సొంతం. ఇంతటి సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు... తిరుమల లడ్డూ ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయనేది వాస్తవం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఒక్కసారిగా షాక్ అయ్యేలా చంద్రబాబు ఆరోపణలు చేశారు. లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని... జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యిని వాడారంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఈ కల్తీకి వైసీపీ నేతలే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు. దీంతో టార్గెట్ వైసీపీ, టార్గెట్ జగన్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. 

అయితే ఈ వ్యవహారంపై ప్రస్తుతం టీడీపీ నేతలు పెద్దగా మాట్లాడటం లేదు. కానీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం ప్రాయశ్చిత దీక్ష పేరుతో దీక్ష చేపట్టారు. కాలి నడకన తిరుమల వెళ్లి ప్రాయశ్చిత్తం చేసుకోనున్నారు. అలాగే ఇప్పటికే విజయవాడ దుర్గ గుడిలో మెట్ల పూజ నిర్వహించారు. ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలు పిలుపిచ్చారు కూడా. అటు జగన్ కూడా... లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని... ఇదంతా తమపై కావాలని చేస్తున్న ఆరోపణలన్నారు. తమకు వేంకటేశ్వర స్వామి అంటే అపార భక్తి ఉందన్నారు... నేరుగా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటానని ప్రకటించారు కూడా. అయితే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలంటూ హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేయడంతో జగన్ వెనక్కి తగ్గారనేది వాస్తవం. తన మతం మానవత్వం అని... తనను అడ్డుకునేందుకే ఇలా డిక్లరేషన్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారంటూ వ్యాఖ్యలు చేశారు జగన్. అలాగే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని కూడా పార్టీ నేతలకు జగన్ పిలుపునిచ్చారు.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ నేతలు సైలెంట్‌గా ఉన్నారనేది వాస్తవం. వైసీపీ, జనసేన నేతలతో పాటు హిందూ ధార్మిక సంఘాలు కూడా తిరుమల లడ్డూ వ్యవహారంపై ఘాటుగానే వ్యాఖ్యలు చేసుకుంటున్నాయి. కానీ టీడీపీ నేతలు మాత్రం నోరెత్తడం లేదు. జగన్ తిరుమల పర్యటన రద్దు తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు.. ఆ తర్వాత దీనిపై కనీసం మాట్లాడలేదు. ప్రస్తుతం సనాతన ధర్మం బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారనేది వాస్తవం. ప్రస్తుతం ఏపీలో ఎలాంటి ఎన్నికలు లేవు. ఇలాంటి సమయంలో ఎన్ని పోరాటాలు చేసిన ఏ ఉపయోగం ఉండదు కూడా. జనసేన, వైసీపీలు పరిస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.. దీని వల్ల టీడీపీ నేతలపై ఫోకస్ పెట్టడం లేదు. నామినేషన్ పదవుల కేటాయింపుపై టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారనేది వాస్తవం. ఈ విషయాన్ని చంద్రబాబు కూడా స్వయంగా అంగీకరించారు. ఇక సంక్షేమ పథకాల అమలులో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు అందజేత అనేది ఇంకా అమలు కాలేదు. అటు తల్లికి వందనంపై ఇప్పటికే జగన్ పలుమార్లు విమర్శలు కూడా చేశారు. కానీ పది రోజులుగా వీటి ఊసే లేదు. తిరుమల లడ్డూ వ్యవహారం తెరపైకి తీసుకురావడం ద్వారా చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ రెండు పార్టీలను అలా బిజీగా ఉంచారన్న వాదన వినిపిస్తోంది.

You can share this post!