Home >>> ఆంధ్రప్రదేశ్ > వారిని పక్కన పెట్టండి బాబు గారు...!
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై పార్టీ నేతలు మరోసారి అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజనరీగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు ఏకైక లక్ష్యం సంపద సృష్టి. మనీ జనరేషన్ చేయడం అనేది ఆయన తర్వాతే. అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమాంతరంగా అమలు చేసిన చరిత్ర కూడా ఆయనకే సొంతం. అయితే ఇదే సమయంలో చంద్రబాబుపై మరో అపవాదు కూడా ఉంది. అధికారంలో ఉన్న సమయంలో కేవలం ఒకరిద్దరు అధికారుల మాటే వింటారని... పార్టీ నేతలను దూరం పెడతారనేది అతి పెద్ద ఆరోపణ. ఈ విషయాన్ని కొంతమంది నేతలు బహిరంగంగానే విమర్శించారు కూడా. 2019-2024 మధ్య కాలంలో దాదాపు పార్టీ నేతలంతా ఇబ్బందులు పడిన మాట వాస్తవం. జగన్ సర్కార్ పాలనలో టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారనేది ప్రధాన అపవాదు. అయితే ఇలాంటి వారికి తప్పకుండా న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే గతంలో ఉన్న చంద్రబాబుకు, ఇప్పటికి చాలా తేడా ఉందని నమ్మించే ప్రయత్నం చేశారు. పైగా పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానంటూ హామీ ఇచ్చారు కూడా.
అయితే ఆ హామీ అమలు జరగటం లేదనేది నేతల ప్రధాన ఆరోపణ. దేవుడు కరుణించినా.. పూజారి వరమియ్యలేదనే సామెత ప్రస్తుతం సరిగ్గా సరిపోతుందంటున్నారు. చంద్రబాబును కలిసేందుకు నిత్యం వందలాది మంది ప్రముఖులు, పార్టీ నేతలు వస్తుంటారనేది వాస్తవం. అయితే వారిలో సగం మంది పైగా నిరాశతోనే వెనుతిరుగుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం... ఆయన దగ్గర ఉంటే అధికారులే అంటున్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలంటూ పార్టీ అధికార ప్రతినిధి చేసిన ఫోన్ కూడా ఎత్తడం లేదనే మాట ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా ఓ ఛానల్ డిబేట్‌లో పార్టీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి సీఎంఓలో ఓ అధికారి పేరును బహిరంగంగానే ప్రస్తావించారు. కపర్ధి అనే అధికారి తమ ఫోన్లు ఎత్తడం లేదని... విరాళం ఇచ్చేందుకు వచ్చిన ఎన్ఆర్ఐ.. నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోయినట్లు జీవీ రెడ్డి చెప్పారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే... సమాధానం లేదని... ఇలా అయితే పార్టీకి ఇబ్బందులు తప్పవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాస్తవానికి వైసీపీ ఓటమికి ఇదే ప్రధాన కారణం. ఐదేళ్ల వైసీపీ పాలనలో మాజీ సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించిన నేతలకు నిరాశే ఎదురైంది. సీఎంలోలో పెత్తనం చేసిన ప్రవీణ్ ప్రకాష్, జవహర్ రెడ్డి మాత్రమే మొత్తం వ్యవహారం చక్కబెట్టారనేది వాస్తవం. ఏ విషయం అయినా సరే... జవహర్ రెడ్డిని దాటి వెళ్లేది లేదని వైసీపీ నేతలే ఆరోపిస్తున్నారు. నేతలకు అధినేత దూరం కావడం వల్లే... కింది స్థాయి నేతల్లో తామంతా చులకన అయ్యామని... నియోజకవర్గాల్లో ఏ పని చేయలేక పోయామనేది వైసీపీ నేతల మాట. చంద్రబాబు కూడా అధికారులను పక్కన పెట్టకపోతే... సేమ్ సీన్ రిపీట్ అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.