కూటమిలో విబేధాలు... పరిష్కరిస్తారా.. వదిలేస్తారా...?

Home >>> ఆంధ్రప్రదేశ్ > కూటమిలో విబేధాలు... పరిష్కరిస్తారా.. వదిలేస్తారా...?

news-details

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి సరిగ్గా వంద రోజులైంది. ఐదేళ్ల పాటు కలిసిమెలిసి సాగాల్సిన ప్రయాణానికి ఆదిలోనే బ్రేకులు పడుతున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇందుకు ప్రధానంగా ఆయా నియోజకవర్గాల్లో నేతలు వ్యవహరిస్తున్న తీరే కారణం. ఏపీలో వైసీపీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతోనే టీడీపీ, జనసేన, బీజేపీలు జతకట్టాయి. సీట్ల కేటాయింపులో కూడా జనసేన పార్టీ కాస్త వెనక్కి తగ్గిందనే చెప్పాలి. తొలుత 31 స్థానాల్లో పోటీ చేయాలని భావించినప్పటికీ... బీజేపీ కోసం పది స్థానాలను త్యాగం చేశారు పవన్. ఇక ఎన్నికల్లో బీజేపీ 7, జనసేన 21, టీడీపీ 136 స్థానాలను గెలుచుకున్నాయి. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. మంత్రివర్గ కూర్పులో కూడా బీజేపీ నుంచి సత్యకుమార్‌కు అవకాశం దక్కగా... జనసేన తరఫున పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. పరిపాలన అద్భుతమని అధినేతలు చెబుతున్నప్పటికీ.. నియోజకవర్గాల్లో మాత్రం నేతల మధ్య విబేధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

ప్రధానంగా టీడీపీ నేతలు సీట్లు వదులుకున్న నియోజకవర్గాల్లో జనసేన, బీజేపీ నేతల పెత్తనం ఎక్కువగా ఉందనే మాట వినిపిస్తోంది. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య విబేధాలు బహిర్గతమయ్యాయి. ఇక్కడ నుంచి పోటీ చేయాలని టీడీపీ నేత పరిటాల శ్రీరాం ఎంతో ప్రయత్నం చేశారు. అదే సమయంలో జనసేన తరఫున టికెట్ కోసం చిలకం మధుసూధన్ రెడ్డి చివరి వరకు యత్నించారు. అటు బీజేపీ తరఫున కూడా వరదాపురం సూరి గట్టిగానే ప్రయత్నాలు చేశారు. అయితే అనూహ్యంగా సత్యకుమార్ టికెట్ దక్కించుకోవడమే కాకుండా... ఏకంగా మంత్రివర్గంలో స్థానం కూడా పొందారు. అయితే సత్యకుమార్ వ్యవహారంపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. గతంలో టీడీపీ నేతలను తీవ్ర ఇబ్బందులు పెట్టిన ధర్మవరం మునిసిపల్ కమిషనర్ మల్లికార్జునకు మళ్లీ ధర్మవరంలోనే పోస్టింగ్ ఇప్పించారు మంత్రి సత్యకుమార్. ఈ విషయంపై మంత్రి కార్యాలయం ఎదుటే టీడీపీ నేతలు ధర్నా కూడా చేశారు. తమ సాయంతోనే గెలిచిన సత్యకుమార్... ఇప్పుడు తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై తాడో పేడో తేల్చుకుంటామంటున్నారు.

ఇదే పరిస్థితి ఇతర నియోజకవర్గాల్లో కూడా ఉందనేది బహిరంగ రహస్యం. ఐదేళ్ల పాటు పార్టీ కోసం పని చేసిన నేతను కాదని అధినేత మాట కోసం టికెట్లు త్యాగం చేశారు టీడీపీ నేతలు. అనకాపల్లిలో అసెంబ్లీ టికెట్ జనసేనకు, పార్లమెంట్ టికెట్ బీజేపీకి కేటాయించారు. దీంతో స్థానిక నేతలకు ఏ మాత్రం పట్టులేకుండా పోయింది. ఏ చిన్న పని కావాలన్నా సరే... జనసేన, బీజేపీ కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. చివరికి తిరుమల శ్రీవారి దర్శనానికి సిఫార్సు లేఖ కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలకు ఇవ్వటం లేదంటున్నారు. ఈ విషయంపై అధినేతకు కూడా ఫిర్యాదు చేసేందుకు రెడీ అంటున్నారు. 

కొన్ని నియోజకవర్గాల్లో అయితే పరిస్థితి మరోలా ఉంది. ఎన్నికల్లో గెలుపు కోసం తమను వెంట తిప్పుకున్నారని.. అయితే గెలిచిన తర్వాత తమను కనీసం పట్టించుకోవడం లేదనేది జనసేన నేతల ఆరోపణ. మార్కాపురం నియోజకవర్గంలో టీడీపీ గెలుపు కోసం ఎంతో ప్రయత్నం చేసిన జనసేన ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్‌కు టీడీపీ నేతలు సరైన గుర్తింపు ఇవ్వటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు కూడా ఎమ్మెల్యే సోదరుడినే ఆహ్వానిస్తున్నారు తప్ప... తమకు కనీస సమాచారం ఇవ్వటం లేదంటున్నారు జనసైనికులు. ఈ విషయంపై అధినేతలు దృష్టి సారించాలని కోరుతున్నారు.

You can share this post!