Home >>> భక్తి > ఈ ఆలయం లోని శిల్పాలు మనలను మంత్రముగ్దులను చేస్తాయి.
కొన్ని ఆలయాలను,వాటిలోని శిల్పసంపదను వీక్షిస్తే ఆనందం, ఆశ్చర్యం కలుగుతాయి.ఇంతటి శిల్పసంపద మనదేశంలో ఉన్నందుకు ఆనందం, వీటిని ఏలాచెక్కారో అని ఆశ్చర్యం కలుగుతాయి.
అలాంటి ఆలయమే బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఇది అందమైన శిల్ప కళా నిలయం.
జిల్లా కేంద్రం అనంతపురంకు 50 కిలోమీటర్ల దూరంలో అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులకు దగ్గరగా ఉన్న తాడిపత్రి పట్టణంలో వుంది ఈ అద్భుత ఆలయం.
ఇక్కడ పెన్నానది తీరంలో త్రేతాయుగం లో
శ్రీ రామచంద్రుడి చేత ప్రతిష్టించబడిన లింగం కావటం చేత రామలింగేశ్వరుడుగా పూజింప బడుచున్నాడు.
క్రీ.శ 1495 ప్రాంతంలో గుత్తి,గండికోట పాలకుడుగా ఉన్న విజయనగర సేనాని రేచెర్ల రామలింగ నాయుడు నీటి బుగ్గలున్న ప్రాంతం లో ఉన్న శివలింగాన్ని గుర్తించి ఆలయాన్ని నిర్మించాడు.
నీటి బుగ్గ ఉన్న ప్రాంతంలో ఉండటం చేత శివుణ్ణి బుగ్గ రామలింగేశ్వరుడు అని పిలువటం వాడుక అయినది.
ఈ ఆలయం కూడా ముస్లిం పాలక సైన్యాల దోపిడీకి గురియై ప్రభావాన్ని కోల్పోగా 1800 సంవత్సరంలో ఈ ప్రాంత కలెక్టర్ థామస్ మన్రో గారి ప్రోత్సాహంతో ఆలయ పునఃరుద్దరణ, పూజాదికాలు ప్రారంభం అయినట్లు తెలుస్తుంది.
ఇది పెన్నానది పడమటి తీరంలో ఉన్నది. కాశీ క్షేత్రంలో లాగే ఆలయానికి వెనుకవైపున శ్మశానవాటిక వున్నందున దీనిని కాశీ క్షేత్రం లాగా భావిస్తారు కూడా. ఆలయానికి శిధిలమైన మూడు ప్రాకార గోపురాలు ఉన్నాయి. శిధిల బాగాలు ఆలయ ప్రాకారానికి వెలుపల బాగంలో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ప్రధాన ద్వారం నుండి లోపలి వెళ్ళేప్పుడు లోపలి కుడి ప్రక్కన గోపురంలో బాగంగానే వినాయకుడికి చిన్నపాటి మందిరం ఉంటుంది.
ఇక్కడ ఆలయ ప్రాంగణంలో శివాలయంతో పాటు మరో రెండు దేవాలయాలు కోదండ రామ స్వామి ఆలయం ప్రధాన గోపురానికి ఎదురుగా దక్షిణ ముఖ ద్వారంతో ఉంటే, రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం పడమటి దిశ ముఖద్వారం కలిగిఉన్నది. వీరబద్ర స్వామికి మరో చిన్న ఆలయం కూడా ఉంది.
తెలంగాణలో ఇదే బుగ్గ రామలింగేశ్వర స్వామి పేరుతొ వికారాబాద్ దగ్గరలో వేరొక ఆలయం ఉన్నది. కానీ తాడిపత్రి ఆలయంలోని శిల్పకళ అద్భుతమైనది..
తాడిపత్రికి చేరటానికి మార్గాలు
రేణిగుంట -గుత్తి రైలు మార్గంలో తాడిపత్రి రైల్వేస్టేషన్ ఉన్నది.దేశంలో చాలా ప్రాంతాలనుండి ఇక్కడకు రైలు ప్రయాణ సౌకర్యమున్నది. దగ్గరలో ఉన్న అనంతపురం, కడప గుత్తి ల నుండి బస్సు ద్వారా లేదా టాక్సీల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. తాడిపత్రిలో సౌకర్యాలతో కూడిన హోటల్స్,లాడ్జి లు వున్నాయి.
కావున ఈ శిల్పకళను వీక్షించి ఆనందించగలరు.