Home >>> భక్తి > భక్తులకు శ్రీవారి దగ్గర దర్శనానికి అడ్డంకి ఏమిటీ...?
కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. నిత్యం గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మారుమోగుతుంటాయి. క్షణకాలం పాటు మాత్రమే లభించే స్వామి దర్శనం కోసం గంటల కొద్ది క్యూ లైన్లల్లో ఎదురు చూస్తారు భక్తులు. వందల కిలోమీటర్ల దూరం నుంచి ఎంతో వ్యయప్రయాసలతో తిరుమల చేరుకునే భక్తులు... స్వామి దర్శనంతో జన్మ చరితార్థమవుతుందని భావిస్తారు. కేవలం క్షణకాలం పాటు... అది కూడా 60 అడుగుల దూరం నుంచి స్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు.
శ్రీవారి ఆలయంలో పూజా విధి విధానాలను వెయ్యి సంవత్సరాలు క్రితమే రామానుజాచార్యులు దిశా నిర్దేశం చేశారు. ఆ మేరకు శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు అర్చకులు. అందుకు అనుగుణంగా శ్రీవారి ఆలయంలో ఆగమ శాస్త్రాన్ని పర్యవేక్షించే బాధ్యత... స్వామి వారికి పూజా కైంకర్యాలు నిర్వహించే అర్చకులు... వారికి సహకరించే జియ్యంగార్లు చూస్తూంటారు. వీరితో పాటు టీటీడీ ఆగమ పండితులతో సలహా మండలిని ఏర్పాటు చేసింది. దీంతో శ్రీవారి ఆలయంలో ఏ కార్యక్రమం జరగాలన్న ఆగమ శాస్ర్త ప్రకారమే జరుగుతుంది. భక్తుల సౌకర్యం కోసమో.. మరొకరి సౌలభ్యం కోసమో.. ఎలాంటి మార్పులను అంగీకరించరు. ఇందుకు చాలానే ఉదాహరణలు వున్నాయి. శ్రీవారి దర్శనార్ధం వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో... ఆలయంలో స్వామి వారిని దర్శించుకునే దూరం కూడా పెరుగుతూ వస్తుంది. గతంలో శ్రీవారిని భక్తులు కులశేఖరపడి నుండి దర్శించుకుంటుండగా.. కాలక్రమేనా తిరుమల వచ్చే భక్తుల సంఖ్య 25 వేలకు మించడంతో లఘు దర్శన విధానాన్ని ప్రవేశ పెట్టింది టీటీడి. దీంతో భక్తులు రాములు వారి మేడ నుండే స్వామి వారిని దర్శించుకునే వారు.
రద్దీ మరింత పెరగడంతో మహాలఘు విధానాన్ని ప్రవేశ పెట్టింది టీటీడి. దీంతో భక్తులు జయ.. విజయులు నుండే స్వామి వారిని దర్శించుకుంటున్నారు. అంటే దాదాపు 60 అడుగులు దూరం నుండే స్వామి వారిని దర్శించుకోవాలి భక్తులు. శ్రీవారిని అంత దూరం నుండి కనులారా దర్శించుకోలేక పోతున్నాం... అది కూడా క్షణ కాలం కూడా వుండదంటూ భక్తుల నుండి తరచూ ఫిర్యాదులు రావడంతో... టీటీడీకి ఈ ఆంశం పెద్ద తలనోప్పిగా మారడంతో... 2009లో తిరుపతిలో పెద్ద సదస్సునే నిర్వహించారు. దేశవ్యాప్తంగా వున్న మఠాధిపతులు, పీఠాధిపతులు, పూర్వపు టీటీడీ ఉన్నతాధికారులు, ఆగమ పండితులతో నిర్వహించిన సమావేశంలో ఆగమ పండితులు మినహా అందరూ ఆలయంలో నేత్ర ద్వారాలు ఏర్పాటు చేయ్యాలని సూచించారు. ఆలయ నిర్మాణంలో మార్పులతోనే భక్తులకు సంతృప్తికర దర్శనం కల్పించవచ్చునని పూర్వపు అధికారులు, నిపుణులు తేల్చి చెప్పారు. అందులో భాగంగానే ఆలయంలో నేత్రద్వారాలు ఏర్పాటు చెయ్యాలన్న ప్రతిపాదనలు తెర పైకి వచ్చింది. కానీ ఆగమ పండితులు ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆగమ శాస్ర్తం ప్రకారం... ఆలయ నిర్మాణంలో ఎలాంటి మార్పులు చేయకూడదని... ఇప్పుడు లక్ష మంది కోసమంటూ... ద్వారాలు ఏర్పాటు చేస్తే... రేపు లక్షన్నర మంది వస్తే... గోడలు మొత్తం తొలగించేస్తారా... అంటూ పండితులు ప్రశ్నించారు. దీంతో ఆ ప్రతిపాదనలు మరుగున పడిపోయాయి. అటు తరువాత... ఆలయంలో ఎక్సలేటర్ విధానం ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనలు వచ్చినా... వాటికి ఆగమ శాస్ర్తం అంగీకరించలేదు. అలా భక్తులకు త్వరతగతిన మంచి దర్శనం కోసం టీటీడీ ఆలయంలో మార్పులు చేయాలనుకున్నా... ఆగమ శాస్ర్తం వ్యతిరేకించడంతో... టీటీడీ వెనక్కి తగ్గింది. దీంతో ఇప్పటికీ ఆ సమస్యకు ఎలాంటి పరిష్కారం లేక... భక్తులు క్షణకాలం కూడా... స్వామివారిని తనివి తీరా దర్శించుకోలేని పరిస్థితి. ఇలా ఆగమ శాస్ర్తాన్ని ఎంతో పటిష్టంగా ఆలయ సంప్రదాయాలతో కొనసాగిస్తూంది టీటీడీ.