టాలీవుడ్‌లో విచిత్ర పరిస్థితి....!

Home >>> సినిమా > టాలీవుడ్‌లో విచిత్ర పరిస్థితి....!

news-details

భారతీయ సినిమాలో ఒక వెలుగు వెలిగిన చరిత్ర తెలుగు సినీ పరిశ్రమది. ఒకప్పుడు ఏడాదికి వందల సినిమాలు రిలీజ్ చేసిన చరిత్ర. స్టార్ హీరోలు సైతం పోటీ పడి సినిమాలు తీశారు. ఇంకా చెప్పాలంటే... ఒకే రోజు మూడు సినిమాలు రిలీజ్ చేసిన ఘనత సూపర్ స్టార్‌ కృష్ణకే దక్కుతుంది. మూడు షిఫ్టుల్లో నాన్ స్టాప్‌గా వర్క్ చేశారు తెలుగు హీరోలు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా... కథకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ... కేవలం 90 రోజుల్లోనే సినిమా పూర్తయ్యేలా ప్లాన్ చేసే వాళ్లు దర్శకులు, నిర్మాతలు. దీని వల్ల సినిమా అనుకున్న సమయానికి పూర్తయ్యేది కూడా. సాంకేతిక విలువలు పెద్దగా అందుబాటులో లేని సమయంలో హీరోలు పోటీ పడి మరి సినిమాలు తీశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అన్ని హంగులు ఆర్భాటాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఏది కావాలన్నా సరే చిటికెలో అందుబాటులోకి వచ్చే పరిస్థితి. ఎలాంటి లోకేషన్ అయినా సరే... వెళ్లవచ్చు... లేదా సెట్ వేయవచ్చు... అయినా సరే... స్టార్ హీరోల సినిమాలైతే ఏడాదికి ఒకటి కూడా రావడం లేదు. సెకండ్ గ్రేడ్ హీరోల సినిమాలు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. దీంతో టాలీవుడ్ స్థాయి పెరిగినప్పటికీ... సినిమాలు తగ్గిపోయాయనే మాట బలంగా వినిపిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో తాజాగా ఓ పోస్ట్ వైరల్ గా మారింది.

స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు కమర్షియల్ సినిమాలను కూడా సంవత్సరాల తరబడి తీస్తున్నారు. టైర్ -2 హీరోలుగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, నాగచైతన్య... ఫ్లాప్ సినిమాలు తీయడంలో పోటీ పడుతున్నారు. ఇక రవితేజ, నాగార్జున, వెంకటేష్ వంటి సినియర్లు మార్కెట్‌ను పూర్తిగా కోల్పోయేలా ఉన్నారు. ఇక మహేష్ బాబు, పవన్ కల్యాణ్ అభిమానులైతే... పాత సినిమాలు రీ రిలీజ్ చేసుకుని సంతోషపడుతూ... మరో ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. వయసుకు తగిన సినిమాలు చిరంజీవి చేయడం లేదు. యథావిధిగా మాస్ సినిమాలనే బాలకృష్ట తీస్తున్నారు. ఇక క్వాలిటీ పరంగా, స్పీడ్ పరంగా మంచి సినిమాలు తీస్తున్న హీరోల జాబితాలో ప్రభాస్, నాని ఉన్నారనే పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూస పద్ధతిలో తెలుగు సినిమా హీరోలు నడుస్తున్నారని... ఒక జోనర్‌కే అలవాటు పడిపోయారని... మళయాళం సినిమా హీరోలు ఎన్నో ప్రయోగాలు చేస్తున్న విషయం టాలీవుడ్ హీరోలకు తెలియటం  లేదా అనే విమర్శలు కూడా చేస్తున్నారు. ఇప్పటికైనా సరే... తెలుగు సినిమా హీరోలు మారితే... పరిశ్రమ బతుకుతుందనే మాట వినిపిస్తోంది.

You can share this post!