Home >>> అంతర్జాతీయం > దేశం వదిలి పారిపోయిన ప్రధాని, బంగ్లాదేశ్ టూ లండన్ వయా ఇండియా...!
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్‌కు చేరుకున్న తర్వాత లండన్ వెళ్లనున్నట్లు బంగ్లాదేశ్ ఆర్మీకి సన్నిహిత వర్గాలు తెలిపాయి. దేశంలో ఒకవైపు నిరసనలు కొనసాగుతున్న తరుణంలోనే ఆమె ఆర్మీ హెలికాప్టర్ లో భారత్ చేరుకున్నారు. ఇక్కడి నుంచి ఆమె నేరుగా లండన్ వెళ్ళే అవకాశం ఉంది. హసీనా భారత్‌లో దిగే అవకాశం ఉందని, ఆ తర్వాత కమర్షియల్ ఫ్లైట్‌లో లండన్‌కు వెళుతుందని బంగ్లాదేశ్ ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. హసీనా సోమవారం తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లినట్లు హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ ప్రకటించారు.
హసీనా ప్రయాణించే హెలికాప్టర్ మన దేశంలోకి ప్రవేశించేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉండగా, హసీనా తన పదవికి రాజీనామా చేశారని, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసి త్వరలో ప్రభుత్వం... పరిపాలనను తమ ఆధీనంలోకి తీసుకుంటుందని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ ప్రకటించారు. తాను పలువురు నేతలతో సమావేశంయ్యానని శాంతిభద్రతల బాధ్యతను ఆర్మీ తీసుకుంటుందని చెప్పానని ఆర్మీ చీఫ్ వెల్లడించారు. జనవరిలో జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షం ఎన్నికలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగోసారి గెలిచిన హసీనాను తొలగించాలని అప్పటి నుంచి నిరసనలు మొదలయ్యాయి.