Home >>> అంతర్జాతీయం > ఫ్రాన్స్ పర్యటనకు సిద్ధమైన ప్రధాని మోడీ.. పూర్తి వివరాలు ఇవే..!
ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటన చేసేందుకు సిద్ధం అయ్యారు. జులై 13, 14 తేదీల్లో ఆయన అక్కడ పర్యటించనున్నారు.ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత ప్రధానిని ఆహ్వానించారు. ఈసారి ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకలు జరుగనున్న తరుణంలో ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. జులై 14న ప్యారిస్ లో జరిగే నేషనల్ డే పరేడ్ లో ప్రధాని పాల్గొననున్నారు. ఇక ఆ తరువాత పరేడ్ లోనే సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఈ వేడుకల్లో భారత సైనిక బృందాలు కూడా పాల్గొననున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రధానికి అధికారిక విందుకు ప్రైవేట్ విందుకు ఆహ్వానించనున్నారు.
ఈ పర్యటన నేపథ్యంలో ఇరువురు దేశాధినేతలు.. వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చలు జరుగనున్నాయి. ప్రధాని మోడీ సెనెట్, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షులతో కూడా సమావేశం అవుతారు. ఆ తరువాత అక్కడి ప్రవాస భారతీయులు, భారత్, ఫ్రెంచ్ సంస్థల సీఈవోలతో ఆయన భేటీ కానున్నారు. ఫ్రాన్స్ రెండు రోజుల పర్యటన ముగిసిన తరువాత ప్రధాని జులై 15న తిరుగు ప్రయాణంలో యూఏఈలో పర్యటించనున్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నయాన్ ని కలువనున్నట్టు భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. దేశాధినేతలు ద్వైపాక్షిక చర్యలు జరుపుతారని పేర్కొంది. ప్రధానంగా ఇంధన, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఆహార భద్రత వంటి అంశాలపై చర్చలు జరుపుతారని పేర్కొంది. అదేవిధంగా ఫిన్ టెక్, రక్షణ, సాంస్కృతిక విభాగాలలో కూడా భారత్.. యూఏఈల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం ఇరువురు నేతలు చర్చిస్తారని భారత విదేశీ వ్యవహారాల శాఖ చెప్పింది.