Home >>> పాలిటిక్స్ > ఏపీలో కాంగ్రెస్ బలపడుతుందా...?
కాంగ్రెస్ పార్టీ... సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన హస్తం పార్టీ ఇప్పుడు పదేళ్లుగా అధికారం కోసం తహతహలాడుతోంది. పదేళ్లు అధికారం అనుభవించిన కాంగ్రెస్ పార్టీ... పదేళ్లుగా ప్రతిపక్షంలోనే మిగిలిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందనే చెప్పాలి. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇక 2019 ఎన్నికల్లో అయితే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరు. తూ తూ మంత్రంగా పోటీ చేసి మేమూ ఉన్నామని పరువు నిలుపుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. అయితే 2024ళ ఎన్నికల్లో మాత్రం పార్టీ వ్యూహం మారింది. అన్న జగన్‌తో గొడవ పడుతున్న షర్మిలను కాంగ్రెస్ పార్టీ తనలో కలిపేసుకుంది. అదే సమయంలో ఏకంగా ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారు ఢిల్లీ పెద్దలు. దీంతో కాంగ్రెస్‌కు కాస్త ఊపు వచ్చినట్లుగా అయ్యింది.
2024 ఎన్నికల్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. అలాగే టీడీపీ, జనసేన, వైసీపీలో టికెట్లు దక్కని నేతలు కొందరు నేరుగా కాంగ్రెస్‌లో చేరిపోయారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఓటమికి ప్రధాన కారణం కాంగ్రెస్ అభ్యర్థి. ఇక ఎన్నికల సమయంలో షర్మిల ఏపీలో సుడిగాలి పర్యటన చేశారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో సభ నిర్వహించారు. ర్యాలీ చేశారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. చివరికి రాజకీయ విశ్లేషకులతో పాటు వైసీపీ నేతలు కూడా జగన్ ఘోర పరాజయంలో షర్మిల పాత్ర 40 శాతం పైనే అని వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత కొద్ది రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న షర్మిల... తిరిగి యాస్టివ్ అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి... వైఎస్‌ఆర్ అభిమానులను ఆకట్టుకున్నారు. వైఎస్‌ఆర్ 75వ జయంతి వేడుకలకు ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గ సహచరులను, వైఎస్ అభిమానులను పిలిచారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న రేవంత్ కూడా... ఏపీలో ఉప ఎన్నికలు వస్తే... కడప జిల్లా ప్రజల కోసం కాంగ్రెస్ జెండా పట్టుకుని గ్రామగ్రామాన తిరుగుతా అని హామీ ఇచ్చారు. ఢిల్లీలో కడప జిల్లా ప్రజల వాణిని వినిపిస్తామని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కాంగ్రెస్‌కు ఊపిరి పోసిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
జగన్‌పై కోపంతో, అసహ్యంతోనే వైసీపీ ఘోర పరాజయం పాలైందనేది ఏపీలో వినిపిస్తున్న మాట. అన్ని వ్యవస్థలను జగన్ నిర్వీర్యం చేశాడు కాబట్టే... జగన్‌కు మరో అవకాశం ఇవ్వలేదని... ఏపీ ఓటర్లు భవిష్యత్తులో కూడా జగన్‌కు ఛాన్స్ ఇవ్వరంటునే మాట పొలిటికల్ సర్కిల్‌లో బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే కీలక నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఈ సమయంలో మళ్లీ పూర్వ వైభవం కోసం ఇదే సరైన సమయమని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఏపీ కాంగ్రెస్ పైన ఢిల్లీ పెద్దలు ఫోకస్ పెట్టారని... తెలంగాణలో పార్టీని గెలిపించిన రేవంత్ రెడ్డికి ఏపీ బాధ్యతలు కూడా అప్పగించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఓ వైపు దూకుడు స్వభావం ఉన్న రేవంత్ రెడ్డి... మరోవైపు ఆర్థికంగా బలమైన నేత డీకే శివకుమార్... వీరితో వైఎస్ఆర్ వారసురాలిగా షర్మిలను బరిలోకి దింపితే... భవిష్యత్తులో కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉందనేది ఢిల్లీ పెద్దల మాట. మరి ఈ వ్యూహం ఎలాంటి ఫలితాలు చూపిస్తుందో చూడాలి.