Home >>> పాలిటిక్స్ > ఆక్రమణలకు పరిష్కారం అదేనా....!
ఆక్రమణ... వినడానికి చిన్న మాటే అయినప్పటికీ... దీని వల్ల జరిగే ప్రమాదం మాత్రం కొండంత ఉంటుంది. ఒక అడుగు జరిగితే నష్టం ఏముంది అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు... కానీ అడుగు ఆక్రమణ వల్ల ఒక జీవితం నష్టపోయే ప్రమాదం పొంచి ఉందనే మాటను ప్రతి ఒక్కరూ విస్మరిస్తారు. కాలువ గట్టు ఆక్రమించి ఇల్లు నిర్మించడం... నీటి ప్రవాహానికి గండి కొట్టడం... అలా ఒకరితో మొదలైన అడుగు ఆక్రమణ... క్రమంగా కాలువ ... చెరువు... చివరికి నదీ గర్భంలో కూడా ఇళ్లు నిర్మించే స్థాయికి ఆక్రమణదారులు తెగబడుతున్నారు. చెరువులు, కుంటల FTL (Full Tank Level) ప్రాంతాలను ఆక్రమించి ఇళ్లు నిర్మించేస్తున్నారు. దీంతో అకాల వర్షాలకు, భారీ వరదలప్పుడు నీటి ప్రవాహానికి అడ్డుపడుతుండటంతో... ఆ నీరంతా... కాలనీలను ముంచెత్తుతున్నాయి. అలాగే ఆక్రమించి నిర్మించిన ఇళ్ల వల్ల గట్టు బలహీనపడి.. తెగిపోవడం జరుగుతుంది కూడా.
హైదరాబాద్ వరదలకు, తాజాగా విజయవాడ ముంపునకు కూడా ఈ ఆక్రమణలే కారణమనేది అందరికీ తెలిసిన విషయమే. హైదరాబాద్ నగరం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది... లేక్స్, రాక్స్... రాళ్లు, కొండలతో నిండిపోయిన నగరానికి తాగునీటి అవసరాల కోసం నిజాం నవాబులు ఎన్నో చెరువులు నిర్మించారు. వాటిలో చాలా వరకు ఇప్పుడు కబ్జాలకు గురయ్యాయనేది వాస్తవం. చెరువులు, నాలాలు ఆక్రమించి ఏకంగా కాలనీలే నిర్మించుకున్నారు. కొందరు బడా బాబులు సైతం ఎలాంటి జంకు లేకుండా ఆక్రమణలు చేసేశారు. దీంతో హైదరాబాద్‌లో ఓ గంట పాటు ఆగకుండా వర్షం కురిస్తే చాలు... రోడ్లన్నీ కాలువలను తలపిస్తాయి. అందుకే తెలంగాణలో రేవంత్ సర్కార్ హైడ్రాను రంగంలోకి దింపింది. ఆక్రమణలు తొలగించడం ద్వారా ప్రజలను ముంపు నుంచి రక్షించవచ్చు అనేది రేవంత్ సర్కార్ మాట.
ఇప్పుడు ఏపీలో కూడా ఇదే మాట వినిపిస్తోంది. విజయవాడ వరదకు ప్రధానంగా బుడమేరు ఆక్రమణే కారణం. బుడమేరును ఆక్రమించి కట్ట వెంట ఇళ్లు నిర్మించారు. ఇది బుడమేరుకే పరిమితం కాలేదు... యనమలకుదురు డ్రైన్, ఏలూరు కాలువ వెంట కూడా ఇదే పరిస్థితి. దీంతో బుడమేరుకు ఒక్కసారిగా భారీ వరద రావడంతో... ఆ బలహీనమైన గట్టుకు గండిపడింది. ఆ నీరు విజయవాడలో సింగ్ నగర్, రామలింగేశ్వర నగర్, పాయకాపురం ప్రాంతాలను ముంచేసింది. దీంతో మరోసారి విజయవాడ వాసులను వరద భయపెట్టకుండా ఉండాలంటే... ఆక్రమణల తొలగింపు ఒక్కటే పరిష్కారం అంటున్నారు నిపుణులు. హైడ్రా తరహాలో ఏపీలో కూడా ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి... కబ్జాలను తొలగించాలని పలువురు కోరుతున్నారు.