Home >>> జాతీయం > అదానీ.. వికీని వదల్లేదా..?
ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీని కష్టాలు ఇప్పట్లో వదిలేలా లేవు. కంపెనీల షేర్లకు కృత్రిమ డిమాండ్ సృష్టించిందంటూ హిండెన్ బర్గ్ నివేదిక ఇవ్వడంతో అదానీ గ్రూపు షేర్లు పేకమేడల్లా కూలుతున్నాయి. ఫలితంగా ప్రపంచ కుబేరుల్లో ఆయన స్థానం పతనమైంది. ఇది చాలదన్నట్టు తాజాగా మరో ఆరోపణ అదానీ గ్రూపునకు మాయని మచ్చగా మరింది. అదానీ గ్రూప్ వికీపీడియాలో సమాచారాన్ని కూడా తారుమారు చేసిందంటూ ఆరోపణ వస్తోంది.
గౌతమ్ అదానీ, ఆయన కుటుంబ సభ్యులు, గ్రూప్ కంపెనీలకు సంబంధించి పక్షపాతంతో కూడిన కంటెంట్‌ను వికీపీడియాలో యాడ్ చేశారని, వికీలో హెచ్చరికలనూ తొలగించారని వికీపీడియా ఆరోపించింది. అదానీ గురించి 2007లో ఆర్టికల్స్ మొదలయ్యాయని, 2012లో ముగ్గురు ఎడిటర్లు దానికి సంబంధించిన కంటెంట్‌లో మార్పులు చేశారని, వార్నింగ్ నోటిఫికేషన్లను సైతం వారు తొలగించారని వికీపీడియా పేర్కొంది. ఇలా 9 ఆర్టికల్స్‌ను రూపొందించిన/ సవరించిన 40 మంది పెయిడ్ ఎడిటర్లు, సాక్‌పప్పెట్స్‌ను బ్లాక్ చేసినట్లు వికీపీడియా తెలిపింది. ఇలా ఎడిట్ చేసిన వారిలో అదానీ గ్రూప్ కంపెనీ ఉద్యోగులూ ఉన్నారని పేర్కొంది. అదానీ గ్రూప్ ఐపీ అడ్రస్‌లను కూడా తాము గుర్తించామని పేర్కొంది. ఇలాంటి ఆర్టికల్స్‌ను రివ్యూ చేసేందుకు ఉన్న రివ్యూయర్ అయిన హాచెన్స్ తన స్థానాన్ని దుర్వినియోగం చేశారని, అతడిపై నిషేధం విధించామని వికీపీడియా పేర్కొంది. ఈమేరకు వికీపీడియాకు చెందిన న్యూస్ పేపర్ ది సైన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది.
సైన్‌పోస్ట్ ప్రచురించిన ఒక కథనాన్ని అదానీ గ్రూపుపై సంచలన రిపోర్ట్ వెలువరించిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఫౌండర్ నాథన్ అండర్సన్ తన ట్వీట్‌కు యాడ్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. సైన్ పోస్ట్ కథనంతో గౌతమ్ అదానీపై మరోసారి అండర్సన్ విమర్శలు ఎక్కుపెట్టాడు. వికీపీడియాను కూడా ఏమార్చారంటూ మండిపడ్డాడు. కాగా.. గతంలోనూ పలువురు బిలీయనీర్లు ఇలా పెయిడ్ ఎడిటింగ్‌లకు పాల్పడ్డ ఉదంతాలు ఉన్నాయని వికీపీడియా తెలిపింది. అయితే వికీపీడియా విమర్శలపై అదానీ గ్రూప్ ఇంతవరకూ స్పందించలేదు.