Home >>> క్రీడలు > క్రీడల్లో రాజకీయాలు... పాపం ఫోగాట్..!
ఆట గొప్పదా... రాజకీయం గొప్పదా అంటే... భారతదేశంలో మాత్రం రాజకీయమే అంటారు. అది ఏ ఆట ఆయినా సరే... రాజకీయ జోక్యం లేకుండా జరిగే ప్రశ్న లేదనేది బహిరంగ రహస్యం. ఎంత ప్రతిభ ఉన్న క్రీడాకారుడు అయినా సరే... రాజకీయ నేతల అండలేకపోతే... క్రీడల్లో రాణించలేరనేది భారత్‌లో ప్రతిఒక్కరికీ తెలిసిన విషయం. ఈ విషయం తాజాగా మరోసారి రుజువైంది. పారిస్ ఒలింపిక్స్ వేదికగా భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పట్ల జరిగిన అన్యాయమే ఇందుకు ప్రధాన ఉదాహరణ.
జీవితంలో పోరాడి గెలిచిన ఫోగాట్... క్రీడా మైదానంలో అగ్రగామిగా నిలిచింది. అయితే రాజకీయ చదరంగంలో పావుగా మారిపోయింది. చివరికి టైటిల్ రేస్ ముందు విధి ఆడిని వింత నాటకంలో బలిపశువుగా మిగిలిపోయింది. కారణం ఏదైనా కావచ్చు... బలైంది మాత్రం ఫోగాట్... ఓ స్టార్ రెజ్లర్ అనేది అక్షర సత్యం. లైగింక వేధింపులకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్న పాపానికి ఫోగాట్ బలైందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీ ఎంపీకి వ్యతిరేకంగా గళం విప్పినందుకే రాజకీయాలు చేసి ఫోగాట్ కెరీర్ బలితీసుకున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు తన కేటగిరి 54 కేజీలు... అందుకు తగినట్లుగానే తన శరీర బరువు 52.5 కేజీలుగా కొద్ది రోజులుగా తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం ఫోగాట్‌ను 50 కేజీల విభాగంలో బరిలోకి దింపారు. దీంతో బరువు తగ్గేందుకు మరింత కఠోర శ్రమ చేయాల్సి వచ్చింది. గ్లాస్ నీరు తాగినా బరువు పెరుగుతానేమో అనే భయంతో కాలం గడిపిన ఫోగాట్... చివరికి డీ హైడ్రేషన్‌కు గురైంది.
అయితే ఫోగాట్ బరువు పెరగడం వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తనకు ఎక్కువ క్యాలరీలు ఉన్న భోజనం అందించారని... అందుకే ఆమె చివరి నిమిషంలో బరువు పెరిగిందనే మాట వినిపిస్తోంది. కేవలం వంద గ్రాముల బరువు... ఓ మేటి క్రీడాకారిణి జీవితాన్ని బలి తీసుకుంది. భారత్ ఖాతాలో తొలి స్వర్ణం రాకుండా చేసింది. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందేమో అని పలువురు క్రీడాభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.