Home >>> తెలంగాణ > తెలంగాణకు నయా నేత...!
తెలంగాణ రాష్ట్రంలో కొత్త నేత వచ్చారు. అవును... ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో నాలుగైదు పార్టీలున్నప్పటికీ... కాంగ్రెస్, భారతీయ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఎన్నికల్లో కూడా ఈ మూడు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులే విజయం సాధించారు. అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంటే... బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోయిందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవానికి మూడోసారి అధికారం మాదే అని గర్వంగా ప్రకటించిన బీఆర్ఎస్ నేతలు.. పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం బోణీ కూడా కొట్టలేకపోయారు. దీంతో ఇప్పుడు అంతా బీఆర్ఎస్ భవిష్యత్ ప్రణాళిక ఏమిటనే కోణంలోనే ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ముఖ్యమైన నేతలంతా నెమ్మదిగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే జిల్లా పరిషత్‌లు, మునిసిపాలిటీలు బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీ ఖాతాలోకి చేరుతున్నాయి.
వాస్తవానికి బీఆర్ఎస్‌ను ఇప్పటి వరకు కంటికి రెప్పలా కాపాడుకున్న నేత కేసీఆర్. పార్టీ పదేళ్లు అధికారంలో ఉందంటే.. అందులో కేసీఆర్ పాత్ర చాలా కీలకం. వరుసగా రెండు సార్లు గెలిచిన కేసీఆర్... పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మార్చేసిన నాటి నుంచి ఫేటు మారిపోయింది. బీఆర్ఎస్ ఓటమి... ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టు... నేతల జంప్.. ఇలా వరుస ఎదురు దెబ్బలు... ఇలాంటి కీలక సమయంలో పార్టీ నేతలకు అండగా ఉండాల్సిన కేసీఆర్... ఫామ్ హౌస్ దాటి రావడం లేదు. ఓడిన తర్వాత కాలు విరిగిందని 3 నెలలు మంచానికే పరిమితం అయ్యారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం చేసినా... ఆయన మాటలో వాడి తగ్గడంతో ఒక్కచోట కూడా బీఆర్ఎస్ గెలవలేదు. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజు అసెంబ్లీకి వచ్చారు. మళ్లీ ఇప్పటి వరకు బయట కనిపించలేదు. ఓడిన నాటి నుంచి కేటీఆర్, హరీష్‌రావులే పార్టీని నడిపిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య కుర్చీకా కిస్సా అన్నట్లుగా పాలిట్రిక్స్ నడుస్తున్నాయనేది బహిరంగ రహస్యం.
ఇలాంటి గడ్డు కాలంలో తెరపైకి కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు ఐదున్నర నెలల తర్వాత సుప్రీంకోర్టు కండీషన్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌పై విడుదలైన కవితకు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు. హైదరాబాద్ చేరుకున్న కవితను భారీ ర్యాలీతో ఇంటికి తీసుకెళ్లారు. ఇక తండ్రిని చూసేందుకు ఫామ్ హౌస్‌కు వచ్చిన కవిత కాళ్లకు ఆమె కంటే వయసులో పెద్దాడైన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నమస్కారం చేశాడు. అయితే ఆ సమయంలో కవిత జీవన్ రెడ్డిని వారించలేదు. కవిత హైదరాబాద్ వచ్చిన సమయంలో, ఫౌమ్ హౌస్‌కు వెళ్లినప్పుడు కూడా సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. వాస్తవానికి బీఆర్ఎస్‌లో కేటీఆర్, హరీష్ మధ్య ఇప్పటికే ఆధిపత్య పోరు నడుస్తోంది. కేసీఆర్ తర్వాత స్థానం తనదే అంటున్నారు ఇద్దరు నేతలు. దీంతో బీఆర్ఎస్‌లో గ్రూప్ రాజకీయాలు ఎక్కువయ్యాయనేది బహిరంగ రహస్యం. ఇలాంటి సమయంలో కవితను సీఎం అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.