వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష..!

Home >>> ఆంధ్రప్రదేశ్ > వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష..!

news-details

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దళిత యువకుల శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులుకు కోర్టు శిక్ష విధించింది. 1996 డిసెంబర్‌ నెలలో రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఐదుగురు దళిత యువకులను చిత్రహింసలకు గురి చేసినట్లు అప్పట్లో కేసు నమోదైంది. వీరిలో ఇద్దరికి శిరోముండనం చేయించినట్లు కూడా తోట త్రిమూర్తులుపై దళిత సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణ దాదాపు 28 ఏళ్ల పాటు కొనసాగింది. ఈ కేసులో తోట త్రిమూర్తులును కోర్టు దోషిగా ప్రకటించి... తీర్పును రిజర్వ్‌ చేసింది. శిరోముండనం కేసును తీవ్రంగా పరిగణించన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు 18 నెలలు జైలు శిక్ష విధించింది. అలాగే రూ.2.5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. మరో ఆరుగురికి కూడా శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.

1996 డిసెంబర్‌లో నెలలో ఈ దారుణం చోటు చేసుకుంది. 28 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణ ఇప్పటికే 148 సార్లు వాయిదా పడింది. దీనిపై అప్పట్లో దళిత సంఘాలు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు కూడా. ఈ కేసులో అప్పట్లో తోట త్రిమూర్తులు జైలుకు కూడా వెళ్లారు. 28 సంవత్సరాలుగా బాధితులు, దళిత సంఘాలు న్యాయం కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు తోట త్రిమూర్తులుకు శిక్ష పడటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం తమవైపు ఉందంటున్నారు. ఈ తీర్పుతో కోర్టుల పట్ల నమ్మకం పెరిగిందని తెలిపారు. తోట త్రిమూర్తులుకు శిక్ష పడటంతో కోర్టు ప్రాంగణంలోనే దళిత సంఘాలు  సంబరాలు జరుపుకున్నాయి. రాబోయే ఎన్నికల్లో మండపేటలో తోట త్రిమూర్తులు ఓటమి ఖాయమంటూ నినాదాలు చేశారు.

You can share this post!