Home >>> తెలంగాణ > త్వరలోనే ఏపీ తెలంగాణా మంత్రుల భేటీ...? ఎవరెవరు...?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాస్త సీరియస్ గానే అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. గత పదేళ్లుగా పరిష్కారం కాని ఈ సమస్యల మీద ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఉమ్మడి ఆస్తుల మీద సిఎం చంద్రబాబు నిర్ణయం ఏంటీ అనేది స్పష్టత రావడం లేదు. అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన భవనాలను తెలంగాణా ప్రభుత్వానికి విక్రయించే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక జల వనరులకు సంబంధించి కూడా సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సమస్యల పరిష్కారానికి త్వరలోనే మంత్రులు సమావేశం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. రెండు రాష్ట్రాల జలవనరుల శాఖా మంత్రులు అలాగే రోడ్లు భవనాల శాఖా మంత్రులు, ఆర్ధిక శాఖా మంత్రులు సమావేశం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. వారితో పాటుగా రెండు రాష్ట్రాల సిఎస్ లు కూడా భేటీలో పాల్గొనవచ్చని సమాచారం.
ఈ సమావేశం ఎక్కడ జరుగుతుంది అనే దానిపై స్పష్టత లేకపోయినా విజయవాడలో జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనిపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చ జరిగిన అనంతరం నిర్ణయం తీసుకోవచ్చని మీడియా వర్గాలు అంటున్నాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలం ముగిసిన నేపధ్యంలో ఈ సమస్యల పరిష్కారానికి ఇంకా ఆలస్యం చేయవద్దని రెండు ప్రభుత్వాలు భావిస్తున్నట్టుగా పరిశీలకులు అంటున్నారు.