దేశంలో ఆర్థిక అస‌మాన‌త‌లు ఈ స్థాయిలో ఉన్నాయా?

Home >>> బిజినెస్ > దేశంలో ఆర్థిక అస‌మాన‌త‌లు ఈ స్థాయిలో ఉన్నాయా?

news-details

భార‌త్‌లో ఆర్థిక అసమానతలు ఊహించ‌ని స్థాయిలో ఉన్నాయ‌ని పేర్కొంటూ బ్రిటన్‌కు చెందిన ఆక్స్ ఫామ్ సంస్థ సంచలనం సృష్టించింది. ఆక్స్‌ఫామ్ ఇండియా సరికొత్త నివేదిక "సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్: ది ఇండియా స్టోరీ" ప్రకారం.. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి గ‌తేడాది నవంబర్ వరకు భారతదేశంలోని బిలియనీర్ల సంపద 121 శాతం పెరిగింది. ఈ పెరుగుద‌ల‌ రోజుకు రూ. 3608 కోట్లుగా ఉంది. 70 కోట్ల భారతీయుల వద్ద ఉన్న సంపద కన్నా 21 మంది ధనవంతుల దగ్గర ఉన్న సంపదే ఎక్కువని ఆ సంస్థ‌ తెలిపింది. దేశంలో 62 శాతం సంపద 5శాతం మంది భారతీయుల దగ్గరే ఉందని.. అత్యంత సంపన్నులైన 21 మంది భారతీయ బిలియనీర్లు 140 కోట్ల మంది భారతీయుల కంటే అదనపు సంపదను కలిగి ఉన్నారని తేల్చింది.

2021లో కేవలం 5శాతం మంది భారతీయులు 62 శాతానికి పైగా పూర్తి సంపదను కలిగి ఉన్నార‌ని ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక పేర్కొంది. 50 శాతం మంది దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు కేవలం 3శాతం సంపదను కలిగి ఉన్నారు. ఈ నివేదిక  ఫలితాలను స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జ‌రుగుతున్న‌ ప్రపంచ ఆర్థిక చర్చా బోర్డులో వెల్ల‌డించారు. భారతదేశంలో 2020లో 102గా ఉన్న‌ బిలియనీర్ల సంఖ్య.. 2022లో 166కు పెరిగిన‌ట్టు ఆక్స్‌ఫామ్ పరిశీలనలో తేలింది.  

భారతదేశంలోని 100 మంది సంపన్నుల మిశ్రమ సంపద 660 బిలియన్ డాల‌ర్లకు (54.12 లక్షల కోట్ల రూపాయలు) చేరుకుంది. ఈ మొత్తంతో 18 నెలలకు పైగా దేశంలో అమ‌ల‌వుతున్న‌ సంక్షేమ ప‌థ‌కాల‌కు నిధులు సమకూర్చ‌వ‌చ్చ‌ని నివేదిక పేర్కొంది. భారతదేశంలోని బిలియనీర్ల  మొత్తం సంపదపై 2శాతం పన్ను విధించినట్లయితే.. అది దేశంలోని పోషకాహార లోపంతో బాధపడేవారికి మూడేళ్ల‌పాటు ఆహారం అందించేందుకు సహాయపడగలదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాబోయే కేంద్ర బ‌డ్జెట్‌లో సంపద పన్నును గుర్తుకు తెచ్చే "ప్రగతిశీల పన్ను చర్యలను" అమలు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆక్సా ఫామ్ ఇండియా సూచించింది.

You can share this post!