వివేకా హత్యకేసులో మరో వైసీపీ నేత...!

Home >>> పాలిటిక్స్ > వివేకా హత్యకేసులో మరో వైసీపీ నేత...!

news-details

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో కొత్త పేరు వెలుగులోకి వస్తోంది. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఇప్పటికే కడప ఎంపీ, సీఎం జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని కూడా ముద్దాయిలుగా తేల్చింది సీబీఐ. హత్యలో జగన్ పాత్ర కూడా ఉందనే అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు వైఎస్ అవినాష్ రెడ్డిని సైతం అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేసింది సీబీఐ. ఇప్పటికే పలువురిని విచారించిన సీబీఐ అధికారులు... తాజాగా మరో వైసీపీ నేతను విచారించారు. ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఎంపీ అవినాష్‌ రెడ్డిని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో అవినాష్‌ సీబీఐ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. 

అవినాష్‌తో పాటు కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన వైసీపీ నేత బుుషికేశవరెడ్డి కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు. అవినాష్‌ కాల్‌ డేటాలో బుుషికేశవరెడ్డి పేరు ఉండటంతో... అతనికి నోటీసులు జారీ చేసింది సీబీఐ. అవినాష్‌తో పాటు విచారణకు హాజరైన బుుషికేశవరెడ్డి... సీబీఐ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు రాత్రి ఏం జరిగింది... వివేకా హత్య విషయం ముందు ఎవరు చెప్పారు... ఎలా తెలిసింది.. హత్య జరిగిన తర్వాత పరిణామాలేమిటి... అవినాష్‌ రెడ్డితో ఉన్న సంబంధాలు ఏమిటీ... అనే కోణాల్లో బుుషికేశవరెడ్డిని సీబీఐ అధికారులు విచారించినట్లు సమాచారం. మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్‌ తీసుకున్న విషయం తెలిసింది. ఈ నెలాఖరు లోపు కేసు విచారణ పూర్తి చేయాల్సి ఉండటంతో... దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు.

You can share this post!