రామ‌చంద్ర పిళ్లై ఆమె బినామీ.. క‌విత‌కు ఈడీ షాక్‌

Home >>> పాలిటిక్స్ > రామ‌చంద్ర పిళ్లై ఆమె బినామీ.. క‌విత‌కు ఈడీ షాక్‌

news-details

ఢిల్లీ మ‌ద్యం కుంభకోణంలో ద‌ర్యాప్తు వేగవంతం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ).. ఈ కేసులో సూత్ర‌ధారుల‌ను గుర్తించే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. గోవా ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఎవరు అందించారు? ఎలా అందాయి? అనే దిశ‌గా దర్యాప్తు సాగిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇప్పటికే అరెస్టయిన వారి నుంచి కేసులో కీలక పాత్రల విషయాన్ని రాబడు తోంది. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈడీ మరోసారి ప్రస్తావించింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన‌ అరుణ్ రామ‌చంద్ర‌ పిళ్లై 17 పేజీల రిమాండ్‌ రిపోర్డులో ఈడీ కీలక విషయాలు వెల్లడించింది. ఎమ్మెల్సీ కవితకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో అరుణ్‌ పిళ్లై అన్నీ తానై వ్యవహరించాడని పేర్కొంది.

హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని అరెస్టు చేసిన ఈడీ రెండ్రోజుల పాటు ప్రశ్నించింది. తాజా అరెస్ట్‌తో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 10కి చేరింది. విచారణ సందర్భంగా తాను కవితకు బినామీ అని రామచంద్ర పిళ్లై వెల్ల‌డించాడ‌ని ఈడీ చేసిన ప్ర‌క‌ట‌న‌ సంచలనం సృష్టిస్తోంది. అంతేకాకుండా కవిత ప్రయోజనాల కోసమే పనిచేశానని తాను ఆమె ప్రతినిధినని పిళ్లయ్ పేర్కొన్నట్టు ఈడీ తెలిపింది. ఢిల్లీ మ‌ద్యం కుంభకోణంలో పిళ్లై కీలక పాత్ర పోషించాడ‌ని.. ఇండో స్పిరిట్ ఏర్పాటులోనూ అత‌ని పాత్ర ఉందని ఈడీ తెలిపింది. సౌత్ గ్రూప్ భాగస్వాములు.. ఆప్ నేతలతో కలిసి కుట్రకు పాల్పడ్డారని స్పష్టం చేసింది. 

అరుణ్ రామచంద్ర పిళ్లై మద్యం తయారీ కంపెనీ ఇండో స్పిరిట్స్ సంస్థకు అన్నీ తానై వ్యవహరిస్తున్నాడ‌ని ఈడీ పేర్కొంది. ఈ కంపెనీలో అత‌నికి 32.5 శాతం వాటా ఉంద‌ని... మనీ లాండరింగ్‌కు పాల్పడ‌టంతో పాటు.. ప్రజాప్రతినిధులకు ఢిల్లీలో మ‌ద్యం లైసెన్సుల విషయంలో అక్రమ మార్గంలో మేలు చేశాడనేది రామ‌చంద్ర‌పిళ్లైపై ప్రధాన ఆరోప‌ణ‌. ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి ‘ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22’కు రూప‌క‌ల్ప‌న‌, అమల్లో కూడా అత‌ను కీలక పాత్ర పోషించాడ‌ని తెలిపింది. ఇక మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆయన కుమారుడు రాఘవ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, అరబిందో శరత్‌చంద్రారెడ్డి త‌దిత‌రులున్న‌ సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 కోట్ల ముడుపులను ఆప్ నేతల తరఫున విజయ్‌నాయర్ స్వీకరించారని ఈడీ ప్రధాన అభియోగం. ఈ గ్రూప్‌న‌కు ప్రాతినిధ్యం వహించిన వారిలో అరుణ్ రామచంద్ర పిళ్లైదే కీల‌క పాత్ర అని అనుమానిస్తున్నారు.

You can share this post!

Related Posts